VARAVARARAO: 'ప్రధాని మోదీ హత్యకు కుట్ర' కేసు.. వరవరరావు అరెస్ట్ కు రంగం సిద్ధం!
- విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు
- అరెస్ట్ చేసి పుణెకు తీసుకెళ్లే అవకాశం
- దాడులను ఖండించిన ప్రజా సంఘాలు
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర కేసులో విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోదీని రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేసేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రలో వరవరరావు పాత్ర కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని మావో సానుభూతిపరుడు రొనాల్డ్ విల్సన్ వద్ద లభ్యమైన లేఖలో వరవరరావు పేరు ఉండటంతో అప్పట్లో అధికారులు కేసు నమోదు చేశారు.
గత మూడు నెలల పాటు ఈ లేఖల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు.. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని వరవరరావు, ఆయన కుమార్తె ఇంటితో పాటు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్ట్ కూర్మనాథ్, క్రాంతి టేకులతో పాటు మరో ఇద్దరి ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్యచేసిన తరహాలో నరేంద్ర మోదీని మట్టుబెట్టాలని మావోయిస్టులు కుట్ర పన్నినట్లు ఉన్న లేఖలను పుణె పోలీసులు 3 నెలల క్రితం విల్సన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు కావాలంటే వరవరరావు సమకూరుస్తారని ఆ లేఖల్లో ఉంది. ఈ నేపథ్యంలో వరవరరావును అరెస్ట్ చేసి పుణెకు తీసుకెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. ఒకవేళ విచారణ కోసం ఆయన్ను పుణెకు తరలించాలనుకుంటే స్థానిక కోర్టులో హాజరుపరచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు వరవరరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.