varavara rao: వరవరరావు అరెస్ట్.. పూణెకు తరలించనున్న పోలీసులు
- విరసం నేత వరవరరావును అరెస్ట్ చేసిన పూణె పోలీసులు
- ప్రధాని మోదీ హత్యకు కుట్ర ఆరోపణలతో ఉదయం నుంచి ఇంట్లో సోదాలు
- వరవరరావు నివాసం వద్ద భారీ భద్రత
ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నేరుగా పూణెకు తరలించనున్నారు. ఈ ఉదయం నుంచి హైదరాబాదులోని వరవరరావు నివాసంలో పూణె పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన నివాసంలో ఉన్న ప్రతి పేపర్ ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు, విచారణ, సోదాలను పూర్తి స్థాయిలో వీడియో తీశారు.
వరవరరావును అదుపులోకి తీసుకుంటున్నట్టు కాసేపటి క్రితమే ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు తెలిపారు. కాసేపట్లో ఆయనను ఆయన నివాసం నుంచి బయటకు తీసుకురానున్నారు. వరవరరావును తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఓ పోలీసు వాహనం అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లోకి వెళ్లింది. కాసేపట్లో ఈ విషయం గురించి పోలీసు అధికారులు మీడియాతో అధికారికంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే, వరవరరావును నేరుగా పూణెకు తీసుకెళ్తారా? లేదా హైదరాబాదులో కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత పూణెకు తరలిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. వరవరరావు నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.