jc diwakar reddy: కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై జేసీ దివాకర్ రెడ్డి స్పందన
- తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఏపీ ప్రజలు హర్షిస్తారు
- ఏపీలో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు
- పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు
ఏపీని దెబ్బ తీయడంలో అన్ని పార్టీల పాత్ర ఉందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతును కోరుతోందని... తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు ఇవ్వడంలో తప్పు లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏపీ ప్రజలు కూడా హర్షిస్తారని అన్నారు. అయితే, ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదని, పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.
ఏపీని బీజేపీ నట్టేట ముంచిందని, తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటోందని, కాంగ్రెస్ ను నమ్మి చూస్తే తప్పేముందని జేసీ ప్రశ్నించారు. పొత్తులకు సంబంధించి ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరని, ఇప్పటి పరిస్థితులు వేరని చెప్పారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని... ముస్లిం ఓటర్లు దూరమవుతారనే భయంతోనే అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని కుయుక్తులు పన్నుతున్నారని జేసీ తెలిపారు. కేంద్రంలో అధికారం మారాల్సిన అవసరం ఉందని అన్నారు.