Andhra Pradesh: ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు విస్తరించాలి: సీఎస్ దినేష్ కుమార్
- ఏపీలో ఇండియన్ బ్యాంకు విస్తరణ హర్షణీయం
- బ్యాంకింగ్ సేవలు మరింతగా అందుబాటులోకి రావాలి
- గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాంకులు విరివిగా స్థాపించాలి
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరించాల్సిన అవసరముందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. ఏపీ సచివాలయంలో సీఎస్ దినేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో ఇండియన్ బ్యాంకు ప్రతినిధులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఇండియన్ బ్యాంకు సేవలు విస్తరింపజేస్తున్నట్లు ఆ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.కె.భట్టాచార్య తెలిపారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలో తమ బ్యాంకు ఆధ్వర్యంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు పేరుతో 10 వేల కోట్ల టర్నోవర్ తో 210 బ్రాంచ్ లు స్థాపించిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత అందుబాటులోకి రావాలని, 65 శాతం మంది ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాంకులను విరివిగా స్థాపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలి డబ్బులను బ్యాంకుల ద్వారానే కూలీలకు అందజేస్తున్నామని, వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కార్పొరేట్ సంస్థలకు వెన్నుదన్నుగా ఉంటూనే వ్యవసాయ రంగానికి, దాని అనుబంధ సంస్థల అభివృద్ధికి ఇండియన్ బ్యాంకు మరింత చేయూత నివ్వాలని కోరారు. ఏపీలో ఇండియన్ బ్యాంకు సేవలు విస్తరింప చేస్తుండడాన్ని దినేష్ కుమార్ అభినందించారు.