TTD: లక్కీడిప్ లో మరో అక్రమం.. నిందితులను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు!
- సేవా టికెట్ల జారీలో దళారుల చేతివాటం
- అధికారులతో కుమ్మక్కై వివరాల సేకరణ
- అరెస్ట్ చేసిన విజిలెన్స్ సిబ్బంది
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో లక్కీ డిప్ కు సంబంధించి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన కొందరు దళారులు సేవా టికెట్లు ఇప్పిస్తామంటూ భక్తుల నుంచి భారీ మొత్తం వసూలు చేశారు. చివరికి వీరిబారిన పడ్డ ఓ వ్యక్తి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తిరుమలకు వచ్చే భక్తులు మిగిలిపోయిన సేవా టికెట్లను పొందేందుకు రోజూ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల లోపు తన పేర్లను లక్కీ డిప్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో కొందరిని ర్యాండమ్ పద్ధతిలో అధికారులు ఎంపిక చేస్తారు. సాయంత్రం 5 గంటల కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఆరు గంటల కల్లా టికెట్ లభించిన వ్యక్తి ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ఈ సందేశాన్ని కౌంటర్ లో చూపిస్తే బ్యాంకు అధికారులు టికెట్ జారీచేస్తారు.
దళారులు నాగేంద్ర, అనిల్ కుమార్, భాను దీన్ని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారి యుగంధర్ తో చేతులు కలిపిన వీరు.. టికెట్లు ఎవరెవరికి వచ్చాయో గంట ముందుగానే తెలుసుకునేవారు. అనంతరం వారి ఫోన్ నంబర్లకు కాల్ చేసి.. ‘మీకు సేవా టికెట్లు ఇప్పిస్తాం. దానికి రూ.6 వేలు ఖర్చవుతుంది’ అంటూ బేరసారాలకు దిగేవారు. తొలుత రూ.6 వేలకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్న వీరు.. సేవా టికెట్లు వచ్చాక మరో రూ.6 వేలు ఇవ్వాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. దీంతో బాధితుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై నిఘా పెట్టిన అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల నకిలీ ఆధార్, ఓటర్ కార్డులతో భారీగా సేవా టికెట్లు దక్కించుకున్న ఇద్దరు దళారులను పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.