rafale deal: అనిల్ అంబానీ హెచ్చరికలు బేఖాతరు.. రాఫెల్ డీల్‌పై మళ్లీ విరుచుకుపడిన కాంగ్రెస్
- రక్షణ మంత్రికి తెలియకుండానే రాఫెల్ డీల్
- డీల్‌పై భారత్-ఫ్రాన్స్ చర్చించబోవన్న రెండు రోజులకే ఒప్పందం
- దేశ చరిత్రలో తొలిసారి ప్రధానిని రక్షణ మంత్రి వెనకేసుకొచ్చారన్న జైపాల్ రెడ్డి
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందం ఫ్రాన్స్-భారత్ మధ్య జరిగిన ఒప్పందం కాదని, ఇది ప్రధాని నరేంద్రమోదీ-అనిల్ అంబానీ మధ్య జరిగిన ఒప్పందమని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందంపై భారత్-ఫ్రాన్స్‌లు చర్చించబోవని 8 ఏప్రిల్ 2015న భారత విదేశాంగ కార్యదర్శి చెప్పారని, కానీ పారిస్ వెళ్లిన మోదీ ఏప్రిల్ 10న ఒప్పందంపై ప్రకటన చేశారని పేర్కొన్నారు.
విదేశాంగ కార్యదర్శికి, రక్షణ మంత్రికి కూడా తెలియకుండానే ఈ ఒప్పందం జరిగిపోయిందని, మోదీ వారినసలు లెక్కలోకే తీసుకోలేదని విమర్శించారు. ఈ ఒప్పందంపై మంత్రులకు తెలియకున్నా అనిల్ అంబానీకి మాత్రం తెలిసిందని, ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి 12 రోజుల ముందే ఆయన రక్షణ కంపెనీని ప్రారంభించారని జైపాల్ రెడ్డి వివరించారు.
అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు కూడా రాఫెల్ డీల్ గురించి తెలియదని, కానీ ప్రధాని వెల్లడించిన తర్వాత ఆయనను వెనకేసుకు రావడానికి పారికర్ దానిని సమర్థించుకున్నారని ఆరోపించారు. కాగా, రాఫెల్ డీల్ విషయంలో తమ ప్రమేయం లేదని, మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే పరువునష్టం దావా వేయడానికి వెనకాడబోనని అనిల్ అంబానీ హెచ్చరించిన తర్వాత కూడా కాంగ్రెస్ తగ్గకపోవడం గమనార్హం.