Jammu And Kashmir: కశ్మీర్ లో ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ.. టాప్ కమాండర్ ని మట్టుబెట్టిన భద్రతా బలగాలు!
- అనంతనాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్
- ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
- ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత
జమ్మూకశ్మీర్ లో ఆర్మీ, పోలీసులపై దాడులకు వ్యూహరచన చేసిన హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ అల్తాఫ్ దార్ అలియాస్ ఖచ్రూను భద్రతా బలగాలు ఈ రోజు మట్టుబెట్టాయి. భద్రతా బలగాల హిట్ లిస్ట్ లో ఖచ్రూకు ‘A ప్లస్ ప్లస్’ స్థాయి ఉంది. అనంతనాగ్ జిల్లాలో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఖచ్రూతో పాటు ఒమర్ రషీద్ వనీ అనే మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చిచంపాయి.
కశ్మీర్ లో పోలీసులు, ప్రభుత్వ బలగాలపై దాడులకు వ్యూహాలు రచించడంలో ఖచ్రూ కీలకంగా వ్యవహరించాడు. గత 11 ఏళ్లుగా భద్రతా బలగాలు చేపడుతున్న అనేక ఆపరేషన్ల నుంచి అతను చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికపై పక్కా సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీస్, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు ఈ రోజు అనంతనాగ్ జిల్లాలోని మునివార్ద్ గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి.
అక్కడే ఓ ఇంటిలో నక్కి ఉన్న ఉగ్రవాదులు బలగాల కదలికలను గుర్తించి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఈ ప్రాంతంలో వదంతులు వ్యాపించకుండా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శ్రీనగర్-బనిహాల్ మార్గంలో రైలు సర్వీసులను కూడా ఆపేశారు.