nandamuri: కన్నీటి పర్యంతమైన మోత్కుపల్లి!
- హరికృష్ణ భౌతికకాయానికి మోత్కుపల్లి నివాళులు
- ఈ వయసులో ఆయన కారు నడపకుండా ఉండాల్సింది
- ఏ దురదృష్టం ఆయన్ని వెంటాడిందో!
నందమూరి కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని, హరికృష్ణ మరణవార్త ఎంతో దురదృష్టకరమని టీ-టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు విచారం వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయాన్ని మోత్కుపల్లి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం, మీడియాతో మోత్కుపల్లి మాట్లాడుతూ, 1982లో తాను అన్న ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్లిన సందర్భంలో హరికృష్ణ కూడా అక్కడే ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. నాడు వ్యవస్థలో మార్పు కోసం ఎన్టీఆర్ తలపెట్టిన యాత్రలో రథసారథిగా ఉన్న గొప్ప నాయకుడు హరికృష్ణ అని కొనియాడారు.
నాడు చైతన్య రథయాత్ర వాహనాన్ని నడిపించి, టీడీపీ విజయానికి కారకుడైనటువంటి నాయకుడు హరికృష్ణ అని అన్నారు. ఈ వయసులో ఆయన కారు డ్రైవ్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని, ఏ దురదృష్టం ఆయన్ని వెంటాడిందో.. హరికృష్ణ మృతి అందరినీ దు:ఖసాగరంలో ముంచివేసిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. నందమూరి కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని, హరికృష్ణ లేకపోవడం ఎంతో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని, శోకసంద్రంలో మునిగిపోయిన ఆయన కుటుంబానికి తన సంతాపం తెలియజేస్తున్నానని మోత్కుపల్లి అన్నారు.