Note ban: నోట్ల రద్దును సమర్థించిన వారిని ఒక్కరిని చూపించండి చాలు: మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం
- ప్రపంచంలోని ఒక్క ఆర్థికవేత్త కూడా పొగడలేదు
- ఆర్థిక సలహాదారుకు కూడా తెలియకుండా చేశారు
- ఇదీ.. మన ఆర్థిక వ్యవస్థ
నరేంద్రమోదీ సర్కారు 8 నవంబరు 2016న చేసిన పెద్ద నోట్ల రద్దును సమర్థించిన వారు ప్రపంచంలో ఒక్కరున్నా తనకు చూపించాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సవాల్ విసిరారు. ప్రపంచంలో ఒక్క ఆర్థికవేత్త కూడా నోట్ల రద్దును ప్రశంసించలేదన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా నోట్ల రద్దును సమర్థించలేదని పేర్కొన్నారు.
నోట్ల రద్దు ప్రకటన గురించి కనీసం ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌కు కూడా తెలియదని, ఆ రోజు ఆయన కేరళలో ఉన్నారని అన్నారు. కీలకమైన నోట్ల రద్దు విషయం ప్రధాన ఆర్థిక సలహాదారుకే తెలియని ఆర్థిక వ్యవస్థ మనదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) కార్యక్రమంలో మాట్లాడుతూ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే, ‘ఆయుష్మాన్ భారత్’ పథకంపైనా చిదంబరం విమర్శనాస్త్రాలు సంధించారు. ఇన్సూరెన్స్ మోడల్ పథకాలు విజయం సాధించిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. అమెరికాలోనూ ఇటువంటి పథకాలు విజయవంతం కాలేదని చిదంబరం వివరించారు.