harikrishna: విడిపోయిన 50 మంది కుటుంబ సభ్యులు హరికృష్ణ సినిమా చూసి మళ్లీ కలసిపోయారు!: సినీ దర్శకుడు సముద్ర
- సెట్ లో హరి ఉన్నాడంటే సందడే
- 15 ఏళ్ల అనుబంధం ఉందన్న దర్శకుడు
- పాత్ర క్లిక్ కావడంతో హరికృష్ణ సంతోషపడ్డారని వెల్లడి
హరికృష్ణ ఉన్నారంటే సినిమా సెట్ చాలా సందడిగా మారిపోయేదని ప్రముఖ దర్శకుడు సముద్ర అన్నారు. సినిమా సెట్ లో హరికృష్ణ జోకులు వేస్తూ అందరినీ నవ్వించేవారనీ, షాట్ రెడీ కాగానే సీరియస్ గా వెళ్లిపోయేవారని గుర్తుచేసుకున్నారు. తమ మధ్య దాదాపు 15 ఏళ్ల అనుబంధం ఉందని సముద్ర గుర్తుచేసుకున్నారు. ఏ క్యారెక్టర్ పడితే అవి కాకుండా మంచివాటిని చేయాలని హరికృష్ణ తపన పడేవారన్నారు.
అందుకు అనుగుణంగానే కుటుంబ విలువలు ఉన్న ‘శివరామరాజు’ సినిమాలో హరికృష్ణ నటించారని తెలిపారు. నా కోసం ఈ క్యారెక్టర్ ను హరి చేశాడన్నారు. అంతకుముందు విడుదలైన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాను చూసి శివరామరాజులో తండ్రి పాత్రను చేయాల్సిందిగా హరికృష్ణను తాను కోరానని చెప్పుకొచ్చారు. ఇందుకు హరికృష్ణ అంగీకరించారన్నారు.
ఈ సినిమా అప్పట్లో రాష్ట్రంలో ప్రజలపై గొప్ప ప్రభావం చూపిందని సముద్ర అన్నారు. ఓ కుటుంబానికి చెందిన విడిపోయిన 50 మంది 'శివరామరాజు' సినిమా చూసి కలిసిపోయారని వెల్లడించారు. ఉమ్మడి కుటుంంబ విలువలను చెప్పడం ద్వారానే ఇది సాధ్యమయిందని పేర్కొన్నారు. ఈ క్యారెక్టర్ క్లిక్ కావడంపై హరికృష్ణ చాలా సంతోషించారని చెప్పారు.