Facebook: ఫేస్బుక్లో డబ్బున్న అమ్మాయిలకు ఎర.. ఆ తర్వాత బ్లాక్మెయిల్.. బెదిరింపులు!
- తొలుత అమ్మాయిలతో చాటింగ్
- ఆపై ఫొటోలు సేకరించి మార్ఫింగ్
- తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బుల డిమాండ్
ఆ యువకుడి పేరు మలిపెద్ది విద్యాసాగర్ రెడ్డి (28). యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని బూజిలాపురం. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్సార్‌నగర్‌లో ఉండే విద్యాసాగర్‌కు ఫేస్బుక్లో చాటింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎందుకంటే.. డబ్బున్న అమ్మాయిలకు వలవేసి డబ్బులు గుంజేందుకు. పాపం పండడంతో పోలీసులకు చిక్కి ఇప్పుడు తీరిగ్గా కటకటాలలో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు.
ప్రైవేటు ఉద్యోగం వల్ల వస్తున్న జీతం సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని విద్యాసాగర్ ప్లాన్ వేశాడు. ఫేస్బుక్లో అమ్మాయిలతో పరిచయం పెంచుకునేవాడు. వారికి మాయమాటలు చెప్పి వారి ఫొటోలు, వివరాలు సేకరించేవాడు. ఆ తర్వాత తన అసలు రూపాన్ని ప్రదర్శించేవాడు. అమ్మాయిల నుంచి ఫొటోలు సేకరించిన నిందితుడు వాటిని మార్ఫింగ్ చేసి, బాధిత అమ్మాయిలకు పంపి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు.
ఈ నెల 19న నిజాంపేట బృందావన్‌కాలనీకి చెందిన ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కి నెట్టారు. దర్యాప్తులో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు ఐదుగురు అమ్మాయిలు, వారి స్నేహితులతో పరిచయం పెంచుకుని నిత్యం చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో నిజాంపేట యువతి పరిచయం అయింది. ఆమె కుటుంబ వివరాలు, ఆస్తి, ఇతర విషయాలు సేకరించాడు.
అనంతరం ఆమె తండ్రికి ఫోన్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. తన దగ్గర యువతి అసభ్య చిత్రాలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అంతేకాదు, ముంబైలో ఉంటున్న ఆమె వద్దకు వెళ్లి, అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. విద్యాసాగర్ మరో యువతితో చాటింగ్ చేస్తున్నాడని గమనించిన పోలీసులు ఆమె సాయంతో.. సుజనా ఫోరం మాల్‌కు రప్పించి అక్కడ అదుపులోకి తీసుకున్నారు.