Jammu And Kashmir: కశ్మీర్లో తెగబడ్డ ఉగ్రవాదులు... 9 మంది పోలీసుల బంధువుల కిడ్నాప్... వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన!
- పోలీసుల బంధువులే టార్గెట్
- 24 గంటల వ్యవధిలో కిడ్నాప్ లు
- రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడ్డారు. రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న వారు, జవాన్లే లక్ష్యంగా కిడ్నాప్ లు చేశారు. సోఫియాన్, కుల్గాం, అనంతనాగ్, అవంతీపురా తదితర ప్రాంతాల్లో నిన్న రాత్రి మూకుమ్మడి కిడ్నాప్ లు జరిగాయి. కనీసం 9 మంది పోలీసులు, జవాన్ల బంధువులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరిలో ఓ డీఎస్పీ సోదరుడు కూడా ఉన్నారు. ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో, రాష్ట్ర పోలీసుల నుంచి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. కిడ్నాపైన వారి పరిస్థితిపై బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కిడ్నాపైన వారిలో జుబైర్ అహ్మద్ భట్ (అరావనిలో పోలీసుగా ఉన్న మహ్మద్ మక్బూల్ భట్ కుమారుడు), ఆరిఫ్ అహ్మద్ శంకర్ (స్టేషన్ హౌస్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ శంకర్ కుమారుడు), ఫైజన్ అహ్మద్ మాక్రో (కుల్గాం పోలీసు అధికారి బషీర్ అహ్మద్ మాక్రో కుమారుడు), సుమర్ అహ్మద్ రాథర్ (యారిపోరా ప్రాంతంలో నివసించే పోలీసు సలామ్ రాథర్ కుమారుడు), గౌహెర్ అహ్మద్ మాలిక్ (కుల్గాం డీఎస్పీ ఐజాజ్ సోదరుడు), యాసిర్ అహ్మద్ భట్ (అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ బషీర్ అహ్మద్ భట్ కుమారుడు) తదితరులు ఉన్నారని తెలుస్తోంది.
వీరితో పాటు మిండోరా ప్రాంతం నుంచి నాసిర్ అహ్మద్, కంగన్ ట్రాల్ ప్రాంతంలోని అహ్మద్ జర్గార్, పింగ్లిష్ ట్రాల్ ప్రాంతంలోని ఆసిఫ్ అహ్మద్ అనే పోలీసుల బంధువులనూ టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కిడ్నాపైన వారి కోసం అణువణువూ గాలిస్తున్నారు.