Social Media: మహారాష్ట్ర ప్రజల కోరికను నెరవేర్చామన్న కేంద్ర మంత్రి.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!
- ముంబై ఎయిర్ పోర్ట్ కు మహరాజ్ పదం జోడింపు
- కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్
- మంత్రిని ఆడుకుంటున్న నెటిజన్లు
సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. దానితో ఎంత లాభమో జాగ్రత్తగా లేకుంటే అంతే నష్టం జరుగుతుంది. తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ప్రభు చేసిన ఓ ట్వీట్ తో నెటిజన్లు ఆయన్ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుకు మహరాజ్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు ప్రభు గురువారం తెలిపారు. చాలాకాలంగా మహారాష్ట్ర ప్రజలు చేస్తున్న డిమాండ్ నెరవేరిందని వెల్లడించారు. పనిలోపనిగా ఈ డిమాండ్ ను పరిష్కరించేందుకు చొరవ చూపిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రభు ధన్యవాదాలు కూడా తెలిపారు.
దీంతో మంత్రి వ్యవహారశైలిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అవునవును.. ఇక ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒక్క విమానం కూడా లేట్ కాదు. అన్ని విమానాలు ఇకపై నిట్టనిలువుగా హెలికాప్టర్ లాగా ఎగురుతాయి’ అని ఓ నెటిజన్ వెటకారమాడాడు. మరొకరు విమానాశ్రయానికి ‘హిందూ హృదయ్ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ సాహిబ్ కీ జై.. జై.. జై.. మహారాష్ట్ర ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టండి’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. తమకు ఇలాంటి పేర్ల మార్పులు వద్దనీ, ఎన్నికల్లో ఇచ్చిన అభివృద్ధి హామీల అమలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం, ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలని మరో వ్యక్తి చురకలంటించాడు.