High Court: 1600 ఎకరాల్లో చెట్లను నరికేస్తున్నారు.. ప్రగతి నివేదన సభను అడ్డుకోండి!: హైకోర్టులో పిల్

  • నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి పిటిషన్
  • పాతిక లక్షల మందిని సమీకరిస్తున్నారని వెల్లడి
  • రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న పిటిషనర్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ వద్ద నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’కు అనుమతి నిరాకరించాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారనీ, దీన్ని రద్దు చేయాలని నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి చీఫ్ పూజారి శ్రీధర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.

ప్రగతి నివేదన సభ కోసం రంగారెడ్డి జిల్లాలో 1600 ఎకరాలను చదును చేస్తున్నారనీ, ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న చెట్లను భారీగా నరికివేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. 25 లక్షల మంది ప్రజలను సమీకరించడం కోసం ఏకంగా లక్ష వాహనాలను వాడుతున్నారని వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ.200 కోట్లను ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఒకేచోటుకు పాతిక లక్షల మందిని సమీకరించే బదులుగా తాము చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా టీఆర్ఎస్ పార్టీని ఆదేశించాలని కోర్టును శ్రీధర్ తరఫు న్యాయవాది శశికిరణ్ కోరారు. 

  • Loading...

More Telugu News