priya warrior: ప్రియా వారియర్ పై తెలంగాణలో నమోదైన కేసు కొట్టివేత!
- ఫిర్యాదుదారుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
- కేసును కొట్టివేస్తూ తీర్పిచ్చిన న్యాయస్థానం
- నటి ప్రియ, దర్శకుడు లులూకు ఊరట
ఒరు అదార్ లవ్ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో కన్నుగీటే సన్నివేశంతో నటి ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీన్ తో ప్రియకు ఎంత స్టార్ డమ్ వచ్చిందో ఇబ్బందులు కూడా అలాగే ఎదురయ్యాయి. ఆమెపై పలుచోట్ల కేసులు దాఖలయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో ప్రియా వారియర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ప్రియా వారియర్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు ఊరట నిచ్చింది. ముస్లింల ఆఖరి ప్రవక్త మొహమ్మద్, ఆయన భార్య ఖతీజాపై మలయాళీ ముస్లింలు పాడుకునే పాటను ఈ చిత్రంలో అభ్యంతరకరమైన రీతిలో వాడారంటూ హైదరాబాద్ లో కేసు దాఖలైంది. ఈ పాటలో నటించిన ప్రియా వారియర్, దర్శకుడు ఒమర్ లులూపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో చిత్ర దర్శక, నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. ‘ఓ సినిమాలో ఎవరో ఏదో పాట పాడారు. మీకు దానిపై కేసు దాఖలు చేయడం తప్ప వేరే పనీపాటా లేదా?’ అని పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఒరు అదార్ లవ్’ సినిమా సెప్టెంబర్ 14న విడుదల కానుంది.