Chandrababu: కేన్సర్ పై ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోంది: సీఎం చంద్రబాబు
- తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ
- రతన్ టాటాతో కలిసి భూమి పూజ చేసిన చంద్రబాబు
- రూ.1000 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం
కేన్సర్ వ్యాధిపై ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి చంద్రబాబు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారతదేశంలో చాలా మంది సేవాతత్పరులు ఉన్నప్పటికీ, అందరి కన్నా ముందుండే వ్యక్తి రతన్ టాటా అని, దేశ వ్యాప్తంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా తక్కువే అన్నట్టుగా ఆయన ఎంతో ఉదారంగా ముందుకు వెళ్తున్నారని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేటాయించిన 25 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. మొత్తం వెయ్యి పడకలకు గాను తొలిదశలో 376 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారని, ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు కేన్సర్ చికిత్సతో పాటు దేశంలోని టాటా కేన్సర్ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారని తెలిపారు. కేన్సర్ చికిత్స కోసం అధునాతన పరికరాలను వినియోగిస్తారని, ఈ ఆసుపత్రి దక్షిణ భారతదేశానికి కేంద్రంగా ఉంటుందని, శ్రీ వేంకటేశ్వరుడి పాదపద్మాల కింద ఈ ఆసుపత్రి రావడం మన అందరి అదృష్టమని, ఇందుకు చొరవ తీసుకున్న టాటా ట్రస్ట్ ను ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని అన్నారు. కాగా, వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల సమీపంలో ఈ వైద్యశాలను టాటా ట్రస్ట్ నిర్మిస్తోంది.