kct: అసెంబ్లీ రద్దైతే... ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఏంటి?
- కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు
- ఆయన నేతృత్వంలోని కేబినెట్ సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది
- రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ సిఫారసు చేయలేరు
ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ రద్దైతే సీఎం కేసీఆర్ పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం.
అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లే వెసులుబాటు రాజ్యాంగపరంగా ఉంది. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ కలిగిన పార్టీగా అవతరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ కు రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీని రద్దు చేసే హక్కు ఉంటుంది. అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా గవర్నర్ కు ముఖ్యమంత్రి సిఫారసు చేస్తారు. ఆ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదిస్తే అసెంబ్లీ రద్దు అవుతుంది. అయినప్పటికీ కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాజ్యాంగంలోని 163వ అధికరణ ప్రకారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీని రద్దు చేస్తూ సిఫారసు చేసినప్పుడు... రాష్ట్రపతి పాలన కోసం సిఫారసు చేసే అధికారం గవర్నర్ కు ఉండదని సుప్రీంకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాది ఒకరు చెప్పారు.