hyderabad: హైదరాబాదులో మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కన్నేసిన ఎంఐఎం
- జూబ్లీహిల్స్, అంబర్ పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాలపై కన్ను
- ఈ స్థానాలను తమకు కేటాయించాలని టీఆర్ఎస్ ను కోరుతున్న అసద్
- నగరంలో మరింత విస్తరించే దిశగా ఎంఐఎం
హైదరాబాదులోని పాతబస్తీలో తిరుగులేని శక్తిగా ఉన్న ఎంఐఎం పార్టీ... నగరంలోని మరో మూడు నియోజకవర్గాలపై కన్నేసింది. రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్, అంబర్ పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన కార్యాచరణను మొదలు పెట్టారని సమాచారం.
టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండే పక్షంలో... జీహెచ్ఎంసీ డివిజన్ల ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని టీఆర్ఎస్ హైకమాండ్ ను అసదుద్దీన్ కోరుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. ఇదే విధంగా అంబర్ పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎంకు ఓట్లు బాగానే పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో మరింత విస్తరించేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది.