New Delhi: రాజధాని జలమయం.. ఢిల్లీ రోడ్లపై భారీగా ప్రవహిస్తున్న వర్షపు నీరు!
- ఢిల్లీలో రెండ్రోజులుగా భారీ వర్షం
- ట్రాఫిక్ ను మళ్లించిన అధికారులు
- ప్రజలకు అలర్ట్స్ పంపుతున్నట్లు వెల్లడి
దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఖజూరీ చౌక్, వజీరాబాద్ రోడ్డు, భజన్ పురా మెయిన్ మార్కెట్, ఎంజీఎం రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఇక 'లోనీ రోడ్డు' సమీపంలో ఐరన్ బ్రిడ్జి వద్ద వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు తోడు చాలాచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో అధికారులు విద్యుత్ సరఫరాను కొన్నిచోట్ల నిలిపివేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న చోట్ల ప్రజలకు హెచ్చరిక సందేశాలు పంపినట్లు తెలిపారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.