Rajasthan: మద్యం మత్తులో కూలీలపైకి కారు పోనిచ్చాడు.. రాజస్తాన్ లో బీజేపీ నేత కుమారుడి నిర్వాకం!
- జైపూర్ లో ఇద్దరు కూలీల దుర్మరణం
- పరారయ్యేందుకు యత్నించిన ప్రబుద్ధుడు
- చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు
తన వెనుక తండ్రి ఉన్నాడన్న ధైర్యమో.. భారీగా డబ్బుందన్న గర్వమో.. ఓ రాజకీయ నేత కొడుకు రాజస్తాన్ లో రెచ్చిపోయాడు. పూటుగా మద్యం సేవించి కారుతో ఫుట్ పాత్ పై పడుకున్న కూలీలను తొక్కించాడు. ఈ ఘటనలో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడగా.. వీరిలో ఇద్దరు ఈ రోజు చికిత్స పొందుతూ చనిపోయారు. జైపూర్ లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీజేపీ కిసాన్ మోర్చా విభాగం నేత బద్రీనాథ్ మీనా కుమారుడు భరత్(35) శుక్రవారం రాత్రి పూటుగా మద్యం సేవించాడు. అనంతరం మత్తులో కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో గాంధీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద కారు ఫుట్ పాత్ పైకి ఎక్కింది. కానీ నిందితుడు కారును అలాగే పోనివ్వడంతో అక్కడ నిద్రపోతున్న నలుగురు కూలీలు టైర్ల కింద నలిగిపోయారు.
ప్రమాదం అనంతరం భరత్, అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో భరత్ ను వైద్య పరీక్షలకు పంపగా లిమిట్ కంటే 9 రెట్లు ఎక్కువ మద్యం తాగినట్లు తేలింది. దీంతో నిందితుడిపై హత్య, ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో రిమాండుకి పంపించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.