venessa: బొమ్మ తుపాకీని గురిపెట్టిన హాలీవుడ్ నటి వెనెస్సా .. కాల్చిచంపిన పోలీసులు!
- నటి వెనెస్సా మర్క్వెజ్ దుర్మరణం
- అపార్ట్ మెంట్ లోకి దూరి షూట్ చేసిన పోలీసులు
- ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆగిన ఊపిరి
ప్రముఖ హాలీవుడ్ నటి వెనెస్సా మర్క్వెజ్(49) ను పోలీసులు కాల్చి చంపారు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో బొమ్మ తుపాకీని ఆమె గురిపెట్టడంతో ప్రతిస్పందించిన పోలీసులు కాల్పలు జరిపారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అమె అప్పటికే చనిపోయింది. అమెరికా వినోద రాజధానిగా పేరుగాంచిన లాస్ ఏంజెల్స్ లో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లాస్ ఏంజెల్స్ లోని పసడెనా ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో వెనెస్సా ఒంటరిగా ఉంటోంది. గత కొంతకాలంగా వెనెస్సా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి మానసిక నిపుణులతో కలసి పోలీసులు చేరుకున్నారు.
తలుపు తెరవాలనీ, తాము సాయం చేసేందుకు వచ్చామని గంటన్నర సేపు అధికారులు అర్ధించారు. అయినా ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా లోపలకు వెళ్లారు. వెంటనే వెనెస్సా తన చేతిలో ఉన్న బొమ్మ తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టింది. దీంతో అధికారులు ఆమెపై కాల్పులు జరిపారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరికి ఆ తుపాకీని పరిశీలించిన పోలీసులు దాన్ని బొమ్మ తుపాకీగా గుర్తించారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో 1968, డిసెంబర్ 21న పుట్టిన వెనెస్సా.. నటనపై చాలా ఆసక్తి చూపింది. 1988లో విడుదలైన స్టాండ్ అండ్ డెలివర్ చిత్రంతో ఆమె దశ తిరిగింది. ఫాదర్ హుడ్(1993), ట్వంటీ బక్స్(1993), అండర్ సస్పీషియన్(2000) వంటి సినిమాలతో పాటు ఈఆర్ అనే టీవీ సిరీస్ లోనూ వెనెస్సా నటించింది.