Imrankhan: ఇమ్రాన్ ఖాన్ మరో నిర్ణయం.. ప్రధాని నివాసంలోని విలాసవంతమైన కార్ల వేలం!
- సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఇమ్రాన్
- పొదుపు చర్యల్లో భాగంగా లగ్జరీ కార్ల వేలం
- ఈనెల 17న వేలం నిర్వహణ
మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా ఇప్పుడు తన 'స్టయిలే వేరు' అంటున్నారు. ప్రధానిగా కొత్త ముద్ర వేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. హంగు ఆర్భాటాలకు, విలాసాలకు తాను దూరంగా ఉంటానని పదవీ బాధ్యతలు చేబట్టిన వెంటనే ఆయన ప్రకటించారు. అందులో భాగంగా అత్యంత విలాసవంతమైన ప్రధాని అధికారిక నివాసాన్ని త్యజించారు. పనివాళ్ల మందీ మార్బలాన్ని వద్దన్నారు. అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపు చర్యలు చేబడుతున్నట్టు పేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రధాని ఇమ్రాన్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నివాసంలో వున్న విలాసవంతమైన పలు కార్లను వేలం వేసి అమ్మేసి ఆ ధనాన్ని ట్రెజరీలో జమ చేయాలని ఆదేశించారు. ఈ నెల 17న ప్రధాని నివాసంలో ఈ వేలం జరుగుతుందని అధికారికంగా పేర్కొన్నారు. ఈమేరకు పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక 'డాన్'లో ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకారం, ఎనిమిది బీఎండబ్ల్యూ కార్లు, నాలుగు మెర్సిడెజ్ బెంజ్ కార్లు (వీటిలో రెండు బుల్లెట్ ప్రూఫ్), 16 టయోటా కార్లు, నాలుగు లాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఒక హోండా సివిక్ కారు.. ఇంకా మరికొన్ని మోడల్స్ కూడా ఈ వేలంలో అమ్మకానికి సిద్ధంగా వున్నాయి.