KCR: నేడు కేసీఆర్ క్యాబినెట్ ప్రత్యేక భేటీ... అసెంబ్లీ రద్దు, పలు కొత్త వరాలు!
- నేడు ఒంటిగంటకు మంత్రి వర్గ భేటీ
- మధ్యంతర భృతి, ఆసరా పింఛన్ల మొత్తం పెంచే అవకాశం
- భారీగా కొత్త ఉద్యోగాల ప్రకటన కూడా!
ముందస్తు ఎన్నికలే లక్ష్యంగా నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది. రైతులు, ఉద్యోగులకు మరిన్ని వరాలను ప్రకటించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. నేడు ఒంటి గంటకు మంత్రివర్గం భేటీ కానుండగా, ఉద్యోగులకు మధ్యంతర భృతి, ఆసరా పింఛన్ల మొత్తం పెంచడం, భారీగా కొత్త ఉద్యోగాలు, అసెంబ్లీ సమావేశాలు జరపడం, ఆపై అసెంబ్లీ రద్దు తదితర అంశాలనూ క్యాబినెట్ చర్చించనుంది. 'ప్రగతి నివేదన సభ'కు ముందే ఈ భేటీ జరుగుతుండటంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.
కాగా, గత నెల 22న అనధికారిక మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న మరోసారి సమావేశం కావాలని ఈ సమావేశంలోనే నిర్ణయించిన కేసీఆర్, అన్ని మంత్రివర్గ శాఖల నుంచి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు పంపాలని కేసీఆర్ ఆదేశించగా, అన్ని వివరాలూ అందాయి. వాటిపై ఉన్నతాధికారులతో చర్చించిన కేసీఆర్, మంత్రి వర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 29 తరువాత అసెంబ్లీ సమావేశాలు జరగక పోవడంతో, నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు... అంటే ఈ నెల 27లోగా అసెంబ్లీ సమావేశాలు జరపడం తప్పనిసరి పరిస్థితి. దీంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీలను సైతం ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తారని తెలుస్తోంది.