TRS: నేడే తెలంగాణ అసెంబ్లీ రద్దు... గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన కేసీఆర్?
- మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్ భేటీ
- ఆ వెంటనే గవర్నర్ ను కలవనున్న కేసీఆర్!
- అటునుంచి కొంగరకలాన్ సభకు
నేడే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్ సహచరులతో సమావేశం కానున్న కేసీఆర్, అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని ప్రకటించి, ఆ వెంటనే గవర్నర్ నరసింహన్ ను కలిసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, ఆ తరువాతే కొంగరకలాన్ కు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారని తెలుస్తోంది. మధ్యాహ్నం గవర్నర్ అపాయింట్ మెంట్ ను కేసీఆర్ కోరినట్టు సమాచారం.
అదే జరిగితే, అసెంబ్లీని సమావేశపరచకుండానే, సభను రద్దు చేసినట్టు అవుతుంది. అప్పుడు మార్చిలో జరిగిన వేసవి కాల సమావేశాలే ప్రస్తుత ప్రభుత్వానికి చివరి అసెంబ్లీ సమావేశాలు అవుతాయి. అసెంబ్లీ రద్దు విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, నేడే ఈ నిర్ణయం వెలువడుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్ నేతలు, ఈ విషయంలో తుది నిర్ణయం వెలువడేంత వరకూ సాధ్యమైనంత మౌనంగానే ఉండాలని భావిస్తున్నారు. అసెంబ్లీ రద్దయితే, కొంగరకలాన్ లో జరిగే భారీ బహిరంగ సభ, ఎన్నికల బాటలో టీఆర్ఎస్ తొలి సభ అవుతుంది.