Nagarjuna Sagar: నాలుగేళ్ల తరువాత తెరచుకున్న సాగర్ గేట్లు... రెండు గేట్ల ఎత్తివేతతో సుందర జలదృశ్యం!
- సాగర్ జలాశయానికి లక్షన్నర క్యూసెక్కులకు పైగా నీరు
- 585 అడుగులను దాటడంతో రెండు గేట్లను తెరచిన అధికారులు
- పెద్దఎత్తున వచ్చిన పర్యాటకులు
దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత నాగార్జున సాగర్ గేట్లు తెరచుకున్నాయి. కొద్దిసేపటిక్రితం అధికారులు రెండు గేట్లను ఎత్తడంతో, కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతూ బయలుదేరింది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1.54 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 47,817 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 585 అడుగులకు పైగా నీరు చేరింది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న రిజర్వాయర్ లో ప్రస్తుతం 295 టీఎంసీల నీరుందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వచ్చే వరద మొత్తాన్ని బట్టి, మరిన్ని గేట్లను తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా, సాగర్ గేట్లు తెరుస్తారని తెలుసుకున్న పర్యాటకులు పెద్దఎత్తున ఇక్కడికి చేరుకుని, సుందర జలదృశ్యాన్ని తిలకించి పులకిస్తున్నారు.