CJI: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్!
- ప్రతిపాదించిన సీజేఐ మిశ్రా
- సంప్రదాయాన్ని అనుసరించిన జడ్జి
- అక్టోబర్ 3న ప్రమాణ స్వీకారం
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియామకానికి మార్గం సుగమమైంది. ప్రస్తుత సీజే జస్టిస్ దీపక్ మిశ్రా తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా గొగోయ్ పేరును సిఫార్సు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం అక్టోబర్ 2న ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కేంద్ర న్యాయశాఖ కోరగా.. జస్టిస్ గొగోయ్ పేరును జస్టిస్ మిశ్రా ప్రతిపాదించారు.
ఈ ఏడాది జనవరిలో కేసుల కేటాయింపుతో పాటు సుప్రీంకోర్టు నిర్వహణలో సీజే ఏకపక్ష వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఈసారి జస్టిస్ గొగోయ్ పేరును మిశ్రా సిఫార్సు చేయకపోవచ్చని వార్తలు వచ్చాయి.
అయితే సుప్రీంకోర్టులో గత సంప్రదాయాన్ని అనుసరించిన మిశ్రా.. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ గొగోయ్ పేరును సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులను కేంద్రం రాష్ట్రపతికి పంపితే, ఆయన ఆమోదముద్ర వేస్తారు. అన్నీ సవ్యంగా సాగితే జస్టిస్ గొగోయ్ భారత సుప్రీంకోర్టుకు 46వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.