Audi: లగ్జరీ కార్ డీలర్లు రూ. 270 కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోతుంటే... ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరెస్ట్!
- ఆగస్టు 29న ఫిర్యాదు చేసిన బ్యాంకు
- వెంటనే అలర్ట్ జారీ చేసిన ఆర్థిక నేరాల విభాగం
- విదేశాలకు పారిపోతుంటే అరెస్ట్
ఆడి, పోర్షే వంటి లగ్జరీ కార్ల డీలర్ షిప్ కేంద్రాలను నిర్వహిస్తూ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియంకు చెల్లించాల్సిన రూ. 270 కోట్లను ఎగ్గొట్టి, బ్రిటన్ పారిపోతున్న రష్ పాల్ సింగ్ టోడ్, మనిధర్ సింగ్ టోడ్ లను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. భారత సంతతి బ్రిటీష్ జాతీయులుగా ఉన్న వీరు, గురుగ్రామ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జెనికా గ్రూప్ పేరిట పలు డీలర్ షిప్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. షోర్షే సెంటర్ గురుగ్రామ్, ఆడి గురుగ్రామ్, ఆడి ఢిల్లీ సెంట్రల్, ఆడీ ప్లస్, ఆడీ సర్వీస్ గురుగ్రామ్, జనికా చైన్ ఆఫ్ యాపిల్ షోరూమ్స్ నిర్వహిస్తున్న వీరు, పేజ్-3 సర్క్యూట్ లో పేరున్న సెలబ్రిటీలే.
వీరిద్దరిపై గత నెల 29వ తేదీన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫిర్యాదు చేసింది. తమను మోసం చేశారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రుణాలను పొందారని ఆరోపించింది. దీంతో ఢిల్లీ పోలీసులు నిర్వహిస్తున్న ఆర్థిక నేరాల విభాగం అలర్ట్ ను జారీ చేసింది. సంస్థ బ్యాలెన్స్ షీట్లలో లాభాలున్నా, గత నాలుగేళ్లుగా వీరు నష్టాలను చూపుతున్నారన్న అభియోగాలు కూడా నమోదయ్యాయి. వీరిద్దరూ డైరెక్టర్లుగా ఉన్న జెనికా కార్స్ ఇండియా, జెనికా పెర్ఫార్మెన్స్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ లపై కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీరికి హెచ్డీఎఫ్సీతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, జేఅండ్ కే బ్యాంకులు రుణాలను ఇచ్చాయి. ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంకే రూ. 120 కోట్లను ఇచ్చింది. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఐపీసీ సెక్షన్ 420, 468, 471, 120బీ తదితరాల కింద కేసు నమోదు చేసినట్టు గురుగ్రాప్ పోలీస్ కమిషనర్ కేకే రావు వెల్లడించారు.