Talasani: అన్నీ బుల్లెట్ బైకులే... బలాన్ని చూపుతున్న తలసాని!

  • భారీ బుల్లెట్ ర్యాలీ, 250 బస్సులు, 1000 కార్లు
  • దాదాపు 50 వేల మందిని తరలించిన తలసాని
  • ఇది ఎన్నికల శంఖారావమే
  • ఇంత భారీ సభ నిర్వహించి చూపాలని విపక్షాలకు సవాల్

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ నాయకత్వంలో సికింద్రాబాద్, రాణిగంజ్ నుంచి భారీ ఎత్తున బుల్లెట్ బైకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రగతి నివేదన సభా ప్రాంగణం కొలువుదీరిన కొంగరకలాన్ వైపు ర్యాలీని ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం ర్యాలీ ప్రారంభం కాగా, తలసాని సైతం ఓ బైకుపై బయలుదేరారు. అంతకుముందు సికింద్రాబాద్ నుంచి 250కి పైగా బస్సులు, 1000 వరకూ కార్లు, ఇతర వాహనాలతో వేలాది మంది సభా ప్రాంగణానికి తరలారు. ఒక్క హైదరాబాద్ నుంచే 3 లక్షల మంది ప్రజలను సమీకరించాలన్న లక్ష్యాన్ని నేతలు నిర్దేశించుకోగా, తన వంతుగా కనీసం 40 వేల మందిని తలసాని తరలించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో ఈ సభ ఓ చరిత్రను సృష్టించనుందని వ్యాఖ్యానించారు. ఇండియాలో ఇప్పటివరకూ ఏ జాతీయ పార్టీగానీ, ప్రాంతీయ పార్టీగానీ ఇంత పెద్ద బహిరంగ సభను నిర్వహించలేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే గత నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు చాటి చెప్పేందుకే ఈ సభను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. ఈ ప్రగతి నివేదన సభను రానున్న అసెంబ్లీ ఎన్నికల శంఖారావంగానే భావిస్తున్నామని అన్నారు. ఏమీ చేతకాని విపక్షాలు, తమ సభ మీదపడి ఏడుస్తున్నాయని ఆయన విమర్శించారు. దమ్ముంటే ఇతర రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో సభను నిర్వహించి చూపాలని తలసాని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News