Jagan: మళ్లీ అలాంటి పరిపాలన తెస్తానని జగన్ చెబుతున్నారు!: దేవినేని ఉమ ఎద్దేవా
- వైఎస్ హయాంలో మంత్రులు, ఐఏఎస్ లు జైలుకెళ్లారు
- నిర్మాణాత్మక ఆలోచనలు చేయడంలో ప్రతిపక్షం విఫలం
- మోదీ కనుసన్నల్లో జగన్ పనిచేస్తున్నారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులు, ఐఏఎస్ లు జైలుకెళ్లారని, మళ్లీ అలాంటి పరిపాలన తెస్తానని జగన్ చెబుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిర్మాణాత్మక ఆలోచనలు చేయడంలో ప్రతిపక్షం విఫలమైందని, ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు.
ప్రాజెక్టులలోకి భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోందని, పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ నుంచి రాయలసీమ జిల్లాలకు నీరు అందిస్తున్నామని దేవినేని చెప్పారు. లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 45 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్ కి, ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 14.5 టీఎంసీలు నిల్వ ఉందని, ఈ ఏడాది పులిచింతలలో 45 టీఎంసీల నిల్వకు చర్యలు చేపడతామని చెప్పారు. నాగార్జునసాగర్ దిగువన ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని దేవినేని ఉమ హెచ్చరించారు.