Andhra Pradesh: బ్యాంకుకి తాళం వేయకుండానే వెళ్లిపోయిన వైనం.. నంద్యాలలో అధికారుల నిర్వాకం!
- తాళం వేయడం మరచిపోయిన సిబ్బంది
- పెట్రోలింగ్ సందర్భంగా గుర్తించిన పోలీసులు
- మేనేజర్ సహా ఆరుగురిపై కేసు
హైఎండ్ సెక్యూరిటీ ఫీచర్లు, ఎవరైనా లోపలకు రాగానే మోగే అలారం.. ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న అత్యాధునిక ఫీచర్లు ఇవి. ఇన్ని భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల దొంగలు బ్యాంకులకు కన్నాలు వేసి నగదు, బంగారం దోచుకెళుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో నంద్యాలకు చెందిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) సిబ్బంది మాత్రం భద్రతా చర్యల మాట అటుంచి, అసలు బ్యాంకుకి తాళం కూడా వేయకుండానే వెళ్లిపోయారు. తమ విధులు నిర్వహించిన అనంతరం.. ఆఫీసు తలుపుల్ని అలాగే బార్లా తెరచివుంచేసి ఎంచక్కా చేతులు ఊపుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు.
నంద్యాల పట్టణం శివార్లలోని శ్రీనివాసనగర్ లో ఉన్న డీసీసీబీలో శనివారం విధులు నిర్వహించిన అనంతరం ఉద్యోగులందరూ వెళ్లిపోయారు. అయితే ఈ సందర్భంగా బ్యాంకుకు సిబ్బంది తాళం వేయడం మరచిపోయారు. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్ కూడా పట్టించుకోలేదు. అయితే ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.. బ్యాంకు తెరచి ఉండటాన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
చివరికి పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ చేయడంతో అక్కడకు వచ్చిన బ్యాంకు అధికారులు తాళం వేసి తీసుకెళ్లారు. తాళం వేయకుండా ఇళ్లకు వెళ్లిపోయిన సమయంలో డీసీసీబీలో రూ.కోటి నగదు, 350 కుటుంబాలకు సంబంధించిన బంగారు ఆభరణాలు లాకర్లలో ఉన్నాయి. కాగా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగానూ బ్యాంకు మేనేజర్ తో పాటు ఐదుగురు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదుచేశారు.