jenasena: సానుకూలంగా జనసేన, సీపీఎం ప్రాథమిక చర్చలు
- ‘తెలంగాణ’లో కలిసి పనిచేయడంపై ఇరు పార్టీల భేటీ
- ఈ రోజు సీపీఎం ప్రతినిధి బృందంతో చర్చించాం
- ఈ చర్చల సారాంశాన్ని జనసేన అధ్యక్షుడుకి వివరిస్తాం
తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొన్న క్రమంలో జనసేన పార్టీతో కలిసి పని చేయాలనే అభిలాషను వ్యక్తం చేసిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతినిధులతో నిర్వహించిన ప్రాథమిక చర్చలు సానుకూలంగా సాగాయి. ఈ విషయాన్ని ‘జనసేన’ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) కన్వీనర్ మాదాసు గంగాధరం తెలిపారు.
హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల ప్రతినిధులు భేటీ అయ్యారు. ‘జనసేన’ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్ర శేఖర్, ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం, రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇన్ ఛార్జ్ ఎన్.శంకర్ గౌడ్, సీపీఎం తరఫున తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, జి.రాములు, డి.జి.నరసింహులు పాల్గొన్నారు.
మాదాసు గంగాధరం మాట్లాడుతూ, ‘పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు సీపీఎం ప్రతినిధి బృందంతో చర్చించాం. ‘జనసేన’ సిద్ధాంతాలు, సీపీఎం భావాల మధ్య సారూప్యత ఉండటంతో చర్చలు సానుకూలంగా సాగాయి. తెలంగాణాలో ఉన్న రాజకీయ పరిణామాలు, మారే పరిస్థితులను బేరీజు వేశాం. ఈ చర్చల సారాంశాన్ని జనసేన అధ్యక్షుడుకి వివరించి, వారి ఆదేశాలతో ముందుకు వెళ్తాం’ అని అన్నారు.
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, ‘తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో ‘జనసేన’తో కలిసి పని చేయాలి. మా రెండు పార్టీల మధ్య భావ సారూప్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ‘జనసేన’తో కలిసి పని చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ‘తెలంగాణ’లో కూడా కలిసి ఉండాలి. ప్రాథమిక దశ చర్చలు సానుకూలంగా సాగాయి’ అని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో చర్చించాలని, అందుకోసం మరోసారి సమావేశమవుతామని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.