kumara swamy: కుమారస్వామి ప్రభుత్వానికి మరో తలనొప్పి.. బీజేపీలో చేరుతామంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- పీఎల్డీ బ్యాంకులపై పట్టుకు జార్కిహొళి సోదరుల పట్టు
- పార్టీ ఇన్చార్జ్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు
- 12 మందితో కలిసి బీజేపీలో చేరుతామంటూ సోదరుల హెచ్చరిక
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి మరో గండం వచ్చిపడింది. పీఎల్డీ బ్యాంకు ఎన్నికల విషయంలో బెళగావి జిల్లాకు చెందిన జార్కిహొళి కాంగ్రెస్ సోదరులు సతీశ్, రమేశ్-జార్కిహొళి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ మధ్య విభేదాలు పొడచూపాయి. లక్ష్మి, సతీశ్ ఎమ్మెల్యేలు కాగా, రమేశ్ మంత్రి. బ్యాంకుపై పట్టు కోసం వీరు ప్రయత్నిస్తుండడం వివాదానికి కారణమైంది.
ఎన్నికల విషయంలో వివాదం తలెత్తడంతో విషయాన్ని పార్టీ ఇన్చార్జ్ వేణుగోపాల్‌కు లక్ష్మి ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆయన పట్టువీడాలంటూ జార్కిహొళి సోదరులకు సూచించారు. లక్ష్మికి వేణుగోపాల్ వత్తాసు పలకడాన్ని జీర్ణించుకోలేకపోయిన జార్కిహొళి సోదరులు బెళగావి రాజకీయాల్లో జోక్యం వద్దంటూ ఆయనను హెచ్చరించారు. ఈ విషయంలో మరోమాటకు తావులేదని, కాదుకూడదంటే తమ సన్నిహితులైన 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరుతామని హెచ్చరించారు. దీంతో వారిని బుజ్జిగించేందుకు అధిష్ఠానం రంగలోకి దిగినట్టు తెలుస్తోంది.