Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై రాళ్ల దాడి!
- చుర్హత్ ప్రాంతంలో ఘటన
- కాంగ్రెస్ పనేనన్న బీజేపీ నేత రైనీష్ అగర్వాల్
- దమ్ముంటే స్వయంగా వచ్చి పోరాడాలన్న చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడిన సంఘటన సిద్ధి జిల్లా చుర్హత్ ప్రాంతంలో కలకలం రేపింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో చౌహాన్, ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చుర్హత్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో చౌహాన్ ర్యాలీ నిర్వహిస్తుండగా, కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదని పోలీసు అధికారులు తెలిపారు.
కాగా, చుర్హత్ నుంచి రాష్ట్ర విపక్ష నేత, కాంగ్రెస్ కు చెందిన అజయ్ సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రోద్బలంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారని, కాంగ్రెస్ కు మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి రైనీష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. రాళ్లదాడి అనంతరం ఓ మీటింగ్ లో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, ధైర్యముంటే అజయ్ సింగ్ స్వయంగా వచ్చి తనతో పోరాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలంతా తనవెంటే ఉన్నారని అన్నారు.