Nagarjuna sagar: కృష్ణమ్మ ఒడిలో.. హాయిగొలిపే ప్రయాణం.. సాగర్-శ్రీశైలం లాంచీ టూర్!

  • మొదలు కానున్న సాగర్-శ్రీశైలం లాంచీ యాత్ర
  • వారానికి రెండు సార్లు సర్వీసులు
  • కృష్ణమ్మ ఒడిలో 6 గంటల విహారం

పర్యాటక ప్రియులకు శుభవార్త. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకూ లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ పర్యాటక సంస్థ ఎండీ బి.మనోహర్ తెలిపారు. సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండటంతో ఈ సర్వీసును మొదలుపెట్టేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ప్రతి బుధవారం, శనివారాల్లో రెండు సార్లు లాంచీలు తిరుగుతాయన్నారు. హైదరాబాద్ నుంచి సాగర్ కు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం బస్సులు  ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ లో ఉదయం 6.30 గంటలకు బస్సు బయలుదేరి 10 గంటలకల్లా సాగర్ కు చేరుకుంటుందని తెలిపారు.

సాగర్ లో లాంచీ ప్రయాణం 10.30 గంటలకు ప్రారంభమవుతుందనీ, సాయంత్రం 4.30 గంటలకు లాంచీ శ్రీశైలానికి చేరుకుంటుందని వెల్లడించారు. ప్యాకేజీలో భాగంగా రాత్రి అక్కడే బస ఏర్పాటు చేసి మరుసటి రోజు ఉదయం శ్రీశైలంలోని ప్రముఖ పర్యాటక స్థలాలను చూపిస్తామన్నారు. అనంతరం 11.30 గంటలకు లాంచీ మళ్లీ బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు సాగర్ కు చేరుకుంటుందని మనోహర్ పేర్కొన్నారు. ఒకవేళ ప్రయాణికులు బస్సులో తిరిగివెళ్లాలని భావిస్తే మధ్యాహ్నం భోజనాలు చేసిన అనంతరం బస్సులో 1.30 గంటలకు శ్రీశైలంలో బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు సాగర్ కు చేరుకోవచ్చని తెలిపారు.

హైదరాబాద్ నుంచి శ్రీశైలం (రానూపోనూ) పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,400 వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఇక సాగర్ నుంచి శ్రీశైలం బోటు ప్రయాణం రానూపోనూ పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,800 చెల్లించాల్సి ఉంటుందని మనోహర్ అన్నారు. కేవలం సాగర్ నుంచి శ్రీశైలానికి బోటులో వెళ్లాలనుకుంటే పెద్దలు రూ.1,000, పిల్లలకు రూ.800 వసూలు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News