Prabhas: మలయాళం స్టార్లు ప్రభాస్ నుంచి చాలా నేర్చుకోవాలి!: వరద సాయంపై కేరళ మంత్రి చురకలు
- ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన సురేంద్రన్
- ఆంధ్రా వాడైనా రూ.కోటి సాయం చేశాడని వ్యాఖ్య
- ప్రభాస్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచన
ఇటీవల కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలు, వరదల దెబ్బకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 10 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కేరళకు ఉదారంగా విరాళాలు అందజేశారు. పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు సైతం పెద్ద మొత్తంలో నగదును అందజేశారు. వీరిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు.
కేరళ వరదల విధ్వంసాన్ని చూసి చలించిపోయిన ప్రభాస్ రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మలయాళం సినిమా స్టార్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళం సహా పరభాషా నటులు కేరళకు ఉదారంగా సాయం చేస్తుంటే. సొంత మలయాళీ నటులు ముందుకురావడం లేదని విమర్శించారు. ఆంధ్రాకు చెందిన ప్రభాస్ ఏకంగా రూ.కోటి సాయం ప్రకటించారనీ, సినిమాకు రూ.3-4 కోట్లు తీసుకుంటున్న మలయాళ సినిమా స్టార్లు ఆయన్ను రోల్ మోడల్ గా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మలయాళం స్టార్లు ప్రభాస్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.
మలయాళం నటుల్లో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కలసి రూ.50 లక్షల సాయం ప్రకటించగా, మోహన్ లాల్ రూ.25 లక్షలు ఇచ్చారు. ఇక మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(అమ్మ) మరో రూ.50 లక్షలను సీఎంకు అందించింది. మిగతా మలయాళి నటులెవరూ సాయం చేసేందుకు ముందుకురాకపోవడంపై మంత్రి సురేంద్రన్ ఈ మేరకు స్పందించారు.