congress: కాంగ్రెస్ పార్టీ నా రక్తం తాగాలన్న దాహంతో ఉంది!: మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
- రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు
- అజయ్ సింగ్ ప్రత్యక్షపోరుకు రావాలి
- ఇలాంటి చర్యలకు నేను తలొగ్గను
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై చౌహాన్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ తన రక్తం తాగాలన్న దాహంతో ఉందని, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదని అన్నారు. భావజాల పరమైన పోరాటాలు మాత్రమే ఇప్పటివరకు కొనసాగాయని, రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించుకునేవని, ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని అన్నారు.
కాగా, సిధి జిల్లాలోని చుర్హాత్ లో జన్ ఆశీర్వాద్ యాత్ర జరుగుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఈ రాళ్ల దాడి జరిగింది. దాని అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షనేత అజయ్ సింగ్ నిజంగా బలమైన నేత అయితే ప్రత్యక్షపోరుకు రావాలని సవాల్ విసిరారు. తాను శారీరకంగా బలంగా లేను కానీ, ఇలాంటి చర్యలకు మాత్రం తలొగ్గనని, రాష్ట్ర ప్రజలంతా తనతో ఉన్నారని వ్యాఖ్యానించారు.