Wife: బీమా సొమ్ము కోసం భర్త హత్య... చిన్నతప్పుతో కటకటాల వెనక్కి!
- ఎనిమిదేళ్ల క్రితం భర్తతో విడిపోయిన పద్మ
- హత్య చేస్తే బీమా సొమ్ము, అతని ఉద్యోగం వస్తుందని ఆశ
- కారు డ్రైవర్ తో బేరం కుదుర్చుకుని ప్లాన్
భర్త పేరిట ఉన్న బీమా సొమ్మును ఎలాగైనా కాజేయాలన్న దుర్బుద్ధితో, అతనికి తరచూ కారును నడిపే వ్యక్తితో బేరం కుదుర్చుకున్న ఓ మహిళ అడ్డంగా బుక్కైంది. వనస్థలిపురం పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చెందిన కేశ్యా నాయక్ తో నల్లగొండ జిల్లాకు చెందిన కేతావత్ పద్మకు 20 సంవత్సరాల క్రితం వివాహం కాగా, ఎనిమిదేళ్ల నుంచి వారు విడిగా ఉంటున్నారు. కేశ్యా నాయక్ పై పద్మ పెట్టిన గృహహింస కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
మరోపక్క, శైలజ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్న కేశ్యా నాయక్, ఇద్దరు బిడ్డలను కని, హాయిగా జీవిస్తుండగా, తాను మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పద్మ వాపోతుండేది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కేశ్యా, తనకు విడాకులు ఇవ్వక పోవడంతో అధికారిక జాబితాలో నామినీగా తన పేరే ఉండటం కలిసొచ్చే అంశంగా భావించింది. భర్తను హత్య చేయిస్తే రూ. 60 లక్షల బీమా సొమ్ము, ఆయన ఉద్యోగం తనకు వస్తాయని ఆశపడింది.
ఈ క్రమంలో కేశ్యాకు కారును నడిపే డ్రైవర్ సభావత్ వినోద్ తో పద్మ పరిచయం పెంచుకుని, భర్తను చంపితే, రూ. 10 లక్షలు ఇస్తానని చెబుతూ, రూ. 15 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. ఓ పథకం ప్రకారం, ఎల్బీ నగర్ లో కేశ్యా నాయక్ ను కలిసిన వినోద్, 'టీఎస్ 07 యూఈ 2221' నంబర్ గల కారులో ఓ బార్ అండ్ రెస్టారెంట్ కు తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆపై గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వెళ్లే మార్గంలోకి తీసుకెళ్లి, అప్పటికే మత్తులో ఉన్న కేశ్యా గొంతు నులిమి చంపాడు.
దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఓ హైటెన్షన్ కరెంట్ స్తంభానికి కారును ఎడమవైపు నుంచి ఢీ కొట్టించి వెళ్లిపోయాడు. తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ ఆదివారం నాడు పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు, కారుకు అయిన డ్యామేజ్ చాలా తక్కువగా ఉండటం, డ్రైవర్ కి చిన్న గాయం కూడా కాకపోవడం అనుమానాలను రేకెత్తించింది. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి చంపినట్టు తేలడంతో, అది హత్యేనన్న నమ్మకంతో, భార్యను విచారించగా, అసలు నిజం తెలిసింది. దీంతో పద్మను, వినోద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ వినోద్ చేసిన చిన్న తప్పు ఈ కేసు మిస్టరీ వీడేలా చేసిందని పోలీసులు వెల్లడించారు.