Petrol: విజయవాడలో లీటరు రూ.85.89, హైదరాబాద్ లో రూ. 84.09కి చేరిన పెట్రోలు ధర!
- మంగళవారం 16 పైసలు పెరిగిన పెట్రోలు ధర
- లీటరు డీజిల్ పై 19 పైసల భారం
- తాజా గరిష్ఠాలకు చేరిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలకు తోడు, రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలను తాజా గరిష్ఠాలకు చేర్చింది. మంగళవారం నాడు వరుసగా పదో రోజూ పెట్రోలు ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 16 పైసలు, డీజిల్ పై లీటరుకు 19 పైసల మేరకు ధర పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 84.09కి, డీజిల్ ధర రూ. 77.60కి చేరుకుంది.
ఇదే సమయంలో విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ. 85.89కి, డీజిల్ ధర రూ. 87.76కు చేరింది. మిగతా మెట్రో నగరాల్లో ధరలను పరిశీలిస్తే, లీటర్ పెట్రోల్ రూ. 86.72, డీజిల్ రూ. 75.74కు చేరింది. పెట్రోల్ ధర కోల్ కతాలో రూ. 82.33కు, చెన్నైలో రూ. 82.41కు చేరగా, డీజిల్ ధర కోల్ కతాలో రూ. 74.29, చెన్నైలో రూ. 75.39కు పెరిగింది. ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలోనే ముడిచమురు ఉత్పత్తి, సరఫరా తగ్గుతుందన్న ఆందోళన నెలకొందని, అందువల్లే ధరలు పెరుగుతున్నాయని చమురు రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.