ds: నోరుమూసుకుని డీఎస్ తక్షణం రాజీనామా చేసి వెళ్లిపోవాలి: ఎమ్మెల్యే బాజిరెడ్డి

  • డీఎస్ ఓ చీడపురుగు
  • ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉండటం మంచిది కాదు
  • పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలి

తనంతట తానుగా టీఆర్ఎస్ కి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని పార్టీ అధిష్ఠానికి ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నోరుమూసుకుని డీఎస్ రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. డీఎస్ ఓ చీడపురుగని, ఆయనకు నీతి, నియమాలు ఉంటే కనుక పార్టీకి రాజీనామా చేయాలని అన్నారు.

ఎంపీ కవితను తన కొడుకు విమర్శిస్తే ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ కాళ్లు పట్టుకుంటేనే డీఎస్ ను ఎంపీగా చేశారని, కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరేందుకు మళ్లీ డీఎస్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో డీఎస్ కొడుకు అరాచకాలు బయటపడలేదని, తండ్రీకొడుకుల గురించి జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు.

డీఎస్ లాంటి వ్యక్తి పార్టీలో ఉండటం మంచిది కాదని పేర్కొంటూ, కలిసికట్టుగా తాము తీర్మానం చేసిన విషయాన్ని బాజిరెడ్డి ప్రస్తావించారు. ఇలా తీర్మానం చేయడాన్ని అగౌరవంగా భావించని డీఎస్, సిగ్గులేకుండా పార్టీలో కొనసాగుతానని అధిష్ఠానానికి లేఖ రాయడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఎస్ కు ఏమాత్రం సిగ్గూలజ్జా ఉన్నా తక్షణం పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బాజిరెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News