ds: డీఎస్ కు సీఎం సమాధానం చెప్పక్కర్లేదు.. నేను చెబితే చాలు!: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి
- గతంలో డీఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించా
- ఈ వ్యక్తి వల్ల నిజామాబాద్ ఇరవై ఏళ్లు వెనకబడింది
- టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జిల్లా అభివృద్ధి చెందుతోంది
తనంతట తానుగా టీఆర్ఎస్ కి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని పార్టీ అధిష్ఠానికి ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఎస్ కు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తాను చెబితే చాలని అన్నారు. ఎందుకంటే, గతంలో డీఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించానని, ఈ వ్యక్తి వల్ల నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పరంగా ఇరవై ఏళ్లు వెనకబడిందని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మొత్తం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. తన పైరవీలు ఇక్కడ నడవట్లేదని, తన మాట ఎవరూ వినడం లేదని భావిస్తున్న డీఎస్ లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నపళంగా, పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయన ఇష్టమొచ్చిన పార్టీలో చేరాలని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.