shivakrishna: ఆ సినిమా షూటింగులో నేను చనిపోయానని అనుకున్నారు: నటుడు శివకృష్ణ
- ఫైట్ మాస్టర్ పొరపాటు చేశాడు
- శిక్షణ లేని గుర్రాన్ని తెచ్చారు
- దాంతో ప్రమాదం జరిగిపోయింది
100కి పైగా విభిన్నమైన కథాచిత్రాలలో నటించిన శివకృష్ణ, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తనకి జరిగిన ఒక ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు. 'నాగభైరవ' అనే సినిమాలో నేను సిఐడి ఆఫీసర్ ను .. దొంగలను పట్టుకోవడానికి వస్తాను. ఒక ఫారెస్ట్ ఏరియాలో షూటింగ్ .. ఆ రోజుతో షూటింగు పూర్తవుతుంది. విలన్ నా చేతులు కట్టేసి గుర్రంపై నన్ను ఈడ్చుకెళ్లాలి.
శిక్షణ పొందిన గుర్రం అందుబాటులోకి రాకపోవడంతో, జట్కా బండికి కట్టే గుర్రాన్ని తీసుకొచ్చారు. ఇక పొరపాటున ఫైట్ మాస్టర్ నిజంగానే గుర్రానికి కట్టబడిన తాడును నా చేతులకు కట్టేశాడు. నేను గ్రహించేలోగా పక్కనే బాంబ్ పేల్చడం .. గుర్రం బెదిరిపోయి నన్ను రెండు ఫర్లాంగులు లాక్కెళ్లడం జరిగిపోయింది. ఒక పెద్ద బండరాయికి కొట్టుకుని నేను చలనం లేకుండా పడిపోయాను. దాంతో నేను చనిపోయాననే అంతా అనుకున్నారు. 'డెడ్ బాడీని ఎలా తీసుకెళ్లాలి .. కారులోనా .. వ్యానులోనా అనే వాళ్ల మాటలు నాకు వినిపిస్తూనే వున్నాయి. అదృష్టం బాగుండి గాయాలతో బయటపడ్డాను" అని చెప్పుకొచ్చారు.