kolkata: కోల్ కతాలో బ్రిడ్జి కూలిపోవడం దురదృష్టకరం: సీఎం మమతా బెనర్జీ
- ఈ ఘటనపై పోలీసు విచారణ జరుగుతోంది
- సమగ్ర దర్యాప్తునకు ఆ తర్వాత ఆదేశిస్తా
- విమానాలు అందుబాటులో లేక వెంటనే వెళ్లలేకపోయా
- డార్జిలింగ్ లో మీడియాతో మమతా బెనర్జీ
దక్షిణ కోల్ కతాలోని పురాతన మజర్ హట్ వంతెన రైల్వే ట్రాక్ పై కుప్పకూలడం దురదృష్టకరమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ప్రమాద సంఘటన జరిగిన సమయంలో ఆమె డార్జిలింగ్ లో పర్యటిస్తున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె స్పందించారు. మంత్రులు, అధికారులను సహాయకచర్యలకు ఆదేశించారు.
అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ ఘటనపై పోలీసు విచారణ జరుగుతున్నందున సమగ్ర దర్యాప్తునకు ఆ తర్వాత ఆదేశిస్తామని అన్నారు. విమానాలు అందుబాటులో లేకపోవడంతో వెంటనే కోల్ కతా వెళ్లలేకపోయానని అన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించినట్టు చెప్పారు.
కాగా, డైమండ్ హార్బర్ రోడ్డులో ఉన్న ఈ వంతెన ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు కుప్పకూలినట్టు ప్రత్యక్షసాక్షుల కథనం. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద 25 మంది చిక్కుకున్నట్టు సమాచారం. శిథిలాల నుంచి తొమ్మిది మందిని రెస్క్యూటీమ్ బయటకు తీసింది.
నలభై ఏళ్ల నాటి వంతెన
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి పిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ, ఈ వంతెనను నలభై ఏళ్ల క్రితం నిర్మించారని చెప్పారు. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు.