Andhra Pradesh: పర్సులో పేలిన మొబైల్ ఫోన్.. భయపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు!
- అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు అందించిన ప్రభుత్వం
- పేలుతున్న ఫోన్లు
- భయపడుతున్న కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అందించిన ఫోన్లు వరుసపెట్టి పేలుతున్నాయి. దీంతో వాటిని పట్టుకోవాలంటేనే కార్యకర్తలు భయపడుతున్నారు. రెండు నెలల క్రితం చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిపోగా, ఈసారి ఏకంగా పర్సులోనే పేలింది. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదించేందుకు కార్యకర్తలకు ప్రభుత్వం సెల్ఫోన్లు అందజేసింది. ఇవి సరిగా పనిచేయకపోవడమే కాకుండా పేలుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
రెండు నెలల క్రితం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి అంగన్వాడీ కార్యకర్త అనురాధ సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టగా కాసేపటికే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. అయితే, చార్జింగ్‌లో ఉండడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. తాజాగా, బోయవీధిలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త యల్లవతి పర్సులో పెట్టుకున్న ఫోన్ పేలింది. దీంతో పర్సులో ఉన్న కొంత నగదు కూడా కాలిపోయింది. వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతుండడంతో వాటిని పట్టుకోవాలంటేనే కార్యకర్తలు భయపడుతున్నారు. వాటి స్థానంలో కొత్త ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.