Telangana: నాగార్జున సాగర్ టేల్‌పాండ్ వద్ద 60 కిలోల తాబేలు.. చూసేందుకు పోటెత్తిన జనం!
- నీటి ఉద్ధృతికి ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తాబేలు
- రాళ్ల మధ్యలో చిక్కుకుపోయిన వైనం
- రక్షించి, నదిలో వదిలిన స్థానికులు
నాగార్జున సాగర్ టేల్‌పాండ్ వద్ద మంగళవారం కనిపించిన తాబేలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 60 కేజీల బరువున్న తాబేలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి బండరాళ్ల మధ్య చిక్కుకుపోయింది. వార్త బయటకు రావడంతో భారీ తాబేలును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున టేల్‌పాండ్ వద్దకు చేరుకున్నారు. దానిని ఫొటోలు తీసుకున్నారు. కొందరు అది కనిపించేలా సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇంత పెద్ద తాబేలును తామెప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా స్థానికులు తెలిపారు. కాగా, రాళ్ల మధ్య చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న తాబేలును అతికష్టం మీద బయటకు తీసి తిరిగి నదిలోకి వదిలారు. ఇటీవల నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన సమయంలో నీటి ఉద్ధృతికి తాబేలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు.