DS: ‘కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు’ అన్న వార్తలపై స్పందించిన డి.శ్రీనివాస్
- మీడియాకు అన్ని విషయాలు చెప్పనని వ్యాఖ్య
- టీఆర్ఎస్ నేతల విమర్శలకు స్పందించబోనని వెల్లడి
- పార్టీ అధిష్ఠానం నుంచి సమాధానం కావాలన్న డీఎస్
నిజామాబాద్ టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎస్ ఈ రోజు నిజామాబాద్ లో తన అనుచరులతో భేటీ అయ్యారు. తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం డీఎస్ స్పందిస్తూ.. అన్ని విషయాలు మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తాను తీసుకునే నిర్ణయాలు తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ ను విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళతానని వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని డీఎస్ తేల్చిచెప్పారు. తనపై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై స్పందించబోనని ఆయన అన్నారు. తనకు టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి సమాధానం కావాలని డీఎస్ వ్యాఖ్యానించారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈ నెల 11న ముహూర్తం ఖరారైందనీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
ఎంపీ కవిత నేతృత్వంలో నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అప్పట్లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే లేఖ రాశారు. అంతేకాకుండా డీఎస్ కుమారుడు సంజయ్ లైంగికవేధింపుల కేసులో ఇటీవల అరెస్టయిన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆయనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.