Supreme Court: స్వలింగ సంపర్కం నేరం కాదు: చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు
- తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం
- 4-1 మెజర్టీతో వెలువడిన తీర్పు
- అందరితో సమానంగా లెస్బియన్లు, గేలకు సమాన హక్కులు ఉంటాయన్న సుప్రీం
సెక్షన్ 377పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కం నేరం కాదని తుది తీర్పును ఇచ్చింది. ఐదుగుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4-1 మెజార్టీతో ఈ తీర్పును వెలువరించింది. సెక్షన్ 377 పరిధిలోకి స్వలింగ సంపర్కం రాదని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. అందరితో సమానంగా లెస్బియన్లు, గేలకు సమాన హక్కులు ఉంటాయని చెప్పింది. సెక్షన్ 377 ఏకపక్షంగా ఉందని అభిప్రాయపడింది. వ్యక్తిగతంగా తమకు ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని తెలిపింది. భావవ్యక్తీకరణను నిరాకరించడమంటే అది మరణంతో సమానమని వ్యాఖ్యానించింది. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తుది తీర్పును వెలువరించింది.
ఇప్పటి వరకు స్వలింగ సంపర్కం సెక్షన్ 377 కింద ఉంది. ఈ సెక్షన్ కింద ప్రకృతి విరుద్ధంగా ఏ మహిళ అయినా, పురుషుడు అయినా స్వలింగ సంపర్కంలో పాల్గొంటే నేరంగా భావిస్తూ వచ్చారు. నేరం రుజువైతే జీవితకాల శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై స్వలింగ సంపర్కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.