kgh: చంద్రబాబు గారు అక్కడ పడుకోవాల్సిన అవసరం లేదు.. విజిట్ చేస్తే చాలు: విష్ణుకుమార్ రాజు

  • కేజీహెచ్ ను చంద్రబాబు ఒక్కసారి విజిట్ చేయాలి
  • ఆసుపత్రి రూపు రేఖలే మారిపోతాయి
  • అక్కడ ఓ రాత్రి బస చేసి మా కామినేని మంత్రి పదవి కోల్పోయారు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేఎల్సీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో పడకల కొరత ఉందనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో వైద్య శాఖను మా పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావు చూసేవారని... ఇప్పుడు ఆ శాఖను ముఖ్యమంత్రి గారే చూస్తున్నారని... ఇప్పటికైనా ఆసుపత్రిలో సరైన వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రిలో ఇప్పుడున్న వేయి పడకలు సరిపోవడం లేదని, సిబ్బంది కొరత కూడా ఉందని విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రి గారు తరచుగా విశాఖ వస్తున్నారని, ఆయన ఒకసారి ఆసుపత్రిని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది వరకు మా కామినేని శ్రీనివాసరావు ఆసుపత్రిలో ఒక రాత్రి బస చేశారని, తాను వద్దన్నా వినలేదని, ఆ తర్వాత ఆయన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు.

'అక్కడ ఏదో సెంటిమెంట్ ఉందట. అందుకే సీఎం గారిని అక్కడ పడుకోమని నేను చెప్పడం లేదు. కేవలం విజిట్ చేస్తే చాలు' అంటూ నవ్వుతూ చెప్పారు. చంద్రబాబు ఒక్కసారి ఆసుపత్రిని విజిట్ చేస్తే, కేజీహెచ్ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. తప్పకుండా ఆసుపత్రి బాగుపడుతుందని అన్నారు. 

  • Loading...

More Telugu News