kcr: 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కేసీఆర్
- ఆందోల్, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లభించని అవకాశం
- ఐదు స్థానాల సీట్లు పెండింగ్
- 15 సర్వేల ఆధారంగా సీట్లను కేటాయించామన్న కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు మామూలుగా లేదు. ఊహించని విధంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ మరో ఊహించని అడుగు వేశారు. ప్రతిపక్షాలు సైతం విస్మయం చెందేలా ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 105 మంది ఎమ్యెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.
ఆందోల్, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ స్థానాలను పెండింగ్ లో ఉంచామని చెప్పారు. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి సీట్లను వారికే కేటాయించడం జరిగిందని చెప్పారు. సిట్టింగ్ లను మార్చబోమని గతంలోనే చెప్పానని... చెప్పినట్టుగానే అందరికీ సీట్లను ఇస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల చిన్నచిన్న సమస్యల కారణంగా కొందరికి తొలి జాబితాలో సీట్లను కేటాయించలేకపోయామని చెప్పారు. 15 సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు.