K Kavitha: నాడు కవిత, కేటీఆర్ నా దగ్గరకొచ్చి మాట్లాడిన మాటలు మర్చిపోలేదు!: మధు యాష్కీ
- నాడు కేసీఆర్ ‘నిమ్స్’లో ఉన్నప్పటి విషయమిది
- 2009 డిసెంబరు 9న వాళ్లిద్దరూ నా దగ్గరకొచ్చారు
- ప్రకటన చాలన్నారు, లేకపోతే ప్రాణాలు పోయేట్టు ఉన్నాయన్నారు
కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైన సీఎం కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి మాట్లాడుతూ, ‘కేసీఆర్ నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. 2009 డిసెంబరు 9న కల్వకుంట్ల కవిత, తారకరామారావు లు వాళ్ల మామతో కలిసి రాత్రి పూట నా దగ్గరకు వచ్చారు. అప్పుడు వాళ్లు చెప్పిన మాటలు నేనింకా మరచిపోలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఇవ్వకపోయినా ఫర్వాలేదులే, ముందు కేసీఆర్ దీక్ష విరమించాలంటే ఓ ప్రకటన ఇప్పిస్తే చాలని, లేకపోతే, కేసీఆర్ ప్రాణాలు పోయేట్టు ఉన్నాయని తనతో వాళ్లు అన్నారని చెప్పారు.
‘నెహ్రూ, గాంధీ కుటుంబాలు దేశం కోసం తమకు ఉన్న ఆస్తులను త్యాగం చేశాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 2001కు ముందున్న ఆస్తి ఎంత? ఇప్పుడున్న ఆస్తి ఎంత? తెలంగాణ ప్రజలను మోసగించి ఆస్తులు గడించుకుంది నువ్వా? లేక కాంగ్రెస్ పార్టీనా?.. ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి.. రాహుల్ గాంధీని ‘బఫూన్’ అంటూ ఒక బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నావు’ అని మధుయాష్కీ మండిపడ్డారు.