Andhra Pradesh: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!
- తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో గాలులు
- వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
- 24 గంటల్లో బలహీనపడొచ్చని వెల్లడి
పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు సమీపంలో బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జెంషెడ్ పూర్ కు ఆగ్నేయంగా 140 కి.మీ దూరంలో ప్రస్తుతం వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఇది బలహీన పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.